వర్షాలు తగ్గడంతో విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. బుడమేరు వరద తగ్గింది. 46 డివిజన్లలోని వరద నీరు 8 అడుగుల నుంచి 2 అడుగులకు తగ్గింది. ఇంకా ఆరు డివిజన్లు నీటిలోనే నానుతున్నాయి. బుడమేరుకు ప్రస్తుతం 2600 క్యూసెక్కుల వరద చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో వరద పూర్తిగా అదుపులోకి వచ్చింది. బుడమేరు గండ్లను పూడివేసిన అధికారులు, వాటిని మరింత బలోపేతం చేస్తున్నారు. వరద ప్రాంతాల్లో ప్రభుత్వం సాయం కొనసాగిస్తోంది. కరెంటు పునరుద్దరించారు. కండ్రికలో వరద నీరు కదలకపోవడంతో నున్న నూజివీడు రోడ్డును తవ్వి నీరు కిందికి పంపిస్తున్నారు. రేపు సాయంత్రానికి వరద నీరు పూర్తిగా ఖాళీ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఉత్తరాంధ్రను అతి భారీ వర్షాలు వణికించాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కురిసిన అతి భారీ వర్షాలకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. అల్లూరి జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఒకరు చనిపోయారు. వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. ఏజన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాయుగుండం తీరాన్ని చేరడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరద సాయంపై కలెక్టర్లతో సమీక్షించారు.