వ్యవసాయదారులకు ఆధార్ తరహాలో ప్రత్యేక విశిష్ఠ గుర్తింపు సంఖ్యను కేటాయించడంతోపాటు కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించి మార్చి నాటికి 5 కోట్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి దివేశ్ చతుర్వేది వెల్లడించారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఫైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేశారు. మరో 19 రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుకు అంగీకరించినట్లు కేంద్రం తెలిపింది.
రైతులకు విశిష్ఠ గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు ఇవ్వడం ద్వారా వారు పండించిన పంటలకు మద్దతు ధర దక్కుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా మంజూరు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తోన్న సాయం నేరుగా రైతులకు చేరుతుంది. వ్యవసాయరంగాన్ని డిటలైజేషన్ చేసి, ఆ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం ఈ ప్రాజెక్టు తీసుకువచ్చింది. పంటల బీమా, పంట నష్ట పరిహారంతోపాటు రాయితీలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుంది.