బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో ఈ యేడాది మార్చి 1న జరిగిన పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అబ్దుల్ మతీన్ తాహా, ముసావిర్ హుసేన్ షాజిబ్, షోయబ్ మీర్జా తదితర నిందితుల మీద ఉగ్రవాద సంబంధిత నేరాలకు పాల్పడినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. నిందితులు కెఫేతో పాటు బెంగళూరులోని బీజేపీ కార్యాలయాన్ని కూడా పేల్చేయాలని కుట్ర పన్నినట్లు వెల్లడించింది.
ఎన్ఐఎ ఛార్జిషీట్ ప్రకారం… నిందితులు మొదట 2024 జనవరి 22న పెద్ద దాడి చేద్దామని నిర్ణయించుకున్నారు. అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించిన రోజది. ఆ రోజు బెంగళూరులోని బీజేపీ కార్యాలయంపై దాడి చేయాలన్నది వారి ప్రణాళిక. ఆ కుట్ర విఫలం అవడంతో వారు అదే నగరంలోని మల్లేశ్వరం ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కెఫేను లక్ష్యం చేసుకున్నారు. మార్చి 1న వారు కెఫేలో విజయవంతంగా ఐఈడీ బాంబును పేల్చగలిగారు. ఆ దుర్ఘటనలో 9మంది గాయపడ్డారు.
ఎన్ఐఎ దర్యాప్తు ప్రకారం… నిందితుల్లో ఇద్దరు – అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, ముసావిర్ హుసేన్ షాజిబ్ – ఐసిస్ భావజాలంతో ప్రేరణ పొందారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థలోకి ముస్లిం యువతను రిక్రూట్ చేస్తున్నారు. మిగతా ఇద్దరు నిందితులు – మజ్ మునీర్ అహ్మద్, ముజామిల్ షరీఫ్ – ఇలాగే ఉగ్రవాదం వైపు ఆకర్షించబడ్డారు.
ఆ ముఠా భారతదేశపు సిమ్ కార్డులు, భారతీయ బ్యాంకు ఖాతాలు, భారత్-బంగ్లాదేశ్ నకిలీ గుర్తింపు డాక్యుమెంట్లు ఉపయోగించారని ఎన్ఐఎ కనుగొంది. మరో ప్రధాన నిందితుడు షోయబ్ అహ్మద్ మీర్జాకు లష్కరే తయ్యబా, అల్ హింద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులతో సంబంధాలున్నాయి.