తమిళనాడులో డిఎంకె పాలనలో ఆడవారిపై అత్యాచారాలు, దాడులు అంతేలేకుండా జరిగిపోతున్నాయి. తాజాగా ఒక అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులపై పోలీసులు దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మైనర్ బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం చేయడమే కాదు, కేసు ఉపసంహరించుకోవాలంటూ ఆ బాలిక తల్లిదండ్రులను పోలీసులు హింసించిన సంఘటన వెలుగు చూసింది.
చెన్నైలో ఒక పదేళ్ళ బాలికపై ఆమె పొరుగింటి వ్యక్తి చాలాకాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. విషయం తెలిసిన ఆ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు. అయితే ఆ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ వారిపై పోలీసులు దాడి చేసారు.
బాధితురాలు చెన్నైలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. ఆగస్ట్ 29 సాయంత్రం బాలిక తల్లి పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి, బాలిక కడుపునొప్పితో బాధపడుతోంది. తల్లి కుమార్తెను దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్ళింది. అక్కడ పరీక్ష చేసినప్పుడు ఆ బాలికపై లైంగికదాడి జరిగిందని తెలిసింది. బాధితురాలిని కీల్పాక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యుడు ఆమెను పరీక్షించి బాలికపై పలుమార్లు అత్యాచారం చేసారని తెలియజేసారు.
ఆస్పత్రి సిబ్బంది ఈ వ్యవహారం గురించి అన్నానగర్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేసారు. పోలీసులు ఆస్పత్రికి వెళ్ళారు. వారు నిందితుడి బదులు బాధితురాలి తల్లిదండ్రులపై విరుచుకు పడ్డారు. నిందితుడు సతీష్ పేరును ఫిర్యాదులో ఎందుకు చెప్పారంటూ బాలికను బెదిరించారు. తర్వాత బాలిక తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. మర్నాడు పొద్దున్న వరకూ వారిని అక్కడే ఉంచేసారు. ఈ సంఘటన ఆగస్టు 29న వెలుగు చూసింది. అయితే కేసు మాత్రం ఆగస్టు 31న రిజిస్టర్ చేసారు. అంతేకాదు, బాధిత బాలికకు జిల్లా బాలల హక్కుల అధికారి లేదా బాలికల సంక్షేమ కమిటీ తప్పనిసరిగా ఇవ్వాల్సిన కౌన్సెలింగ్ ఇప్పటివరకూ ఇవ్వలేదు.
బాధిత బాలిక తన ఫిర్యాదులో సతీష్ అనే వ్యక్తిపై ఆరోపణలు చేసింది. అతను మంచినీళ్ళు సరఫరా చేసే వ్యక్తి. అతను ఏడు రోజులుగా బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. ఆ విషయం బైటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమెను బెదిరించాడు.
ఈ వ్యవహారానికి సంబంధించి ఒక వ్యక్తి రికార్డు చేసిన వీడియో బైటపడడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఆ వీడియోలో బాలిక తండ్రి పోలీసులు తనను హింసించిన సంగతి చెప్పాడు. నిర్మాణ కూలీ అయిన ఆ వ్యక్తి తన ఫిర్యాదులో ‘‘వాళ్ళు నా భార్య ప్రవర్తనను ప్రశ్నించారు., నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు’’ అని చెప్పాడు. అదే వీడియోలో అతని భార్య, బాధితురాలి తల్లి తనను పోలీసులు కొట్టారని చెప్పింది.
ఈ కేసులో ఆగస్టు 31న ఎఫ్ఐఆర్ నమోదయింది. ఐనా ఇప్పటివరకూ సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేయలేదు. పైగా అతని సమక్షంలోనే పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి తల్లిదండ్రులను నిలబెట్టారు. వారిని ఇబ్బంది పెట్టారు. ఆ సంఘటనకు బాధితురాలే సాక్షిగా ఉంది.
బాధిత బాలిక కుటుంబం ఆరోపణలను పోలీసులు కొట్టిపడేసారు. కేసు విచారణలో పోలీసుల దుర్మార్గం గురించి ఏ సాక్ష్యమూ లేదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదులో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసారన్న ఆరోపణలను తిరస్కరించారు.