బిహార్ రాజధాని పట్నాలో భారతీయ జనతా పార్టీ నాయకుడు మున్నాశర్మను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేసారు. గొలుసు దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా మున్నా శర్మపై ఆగంతకులు కాల్పులు జరిపారు. ఆ విషయాన్ని పట్నా పోలీసులు ధ్రువీకరించారు.
మున్నా శర్మ గతంలో బిజెపి మండల అధ్యక్షుడిగా పనిచేసారు. ఆయన మెడలోని గొలుసును లాగేందుకు దుండగులు ప్రయత్నించారు. మున్నా శర్మ అడ్డుకోడానికి ప్రయత్నించగా ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూనే మున్నా శర్మ ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు సంఘటనా స్థలం దగ్గర సిసిటివి ఫుటేజ్ సేకరించారు. దాన్ని పరిశీలిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. పట్నా సిటీ-2 డిఎస్పి గౌరవ్ శర్మ మాట్లాడుతూ ‘‘ఫోరెన్సిక్ టీమ్ సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించింది. పోలీసుల ప్రత్యేక బృందం సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలిస్తోంది. ఈ సంఘటనకు కారణం ఏమై ఉంటుందా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాం. మున్నా శర్మ గొలుసు ఇంకా ఆయన మెడలోనే ఉందని కుటుంబ సభ్యులు స్పష్టం చేసారు. ఒక అనుమానితుణ్ణి గుర్తించాం’’ అని చెప్పారు.