‘‘అత్యాచారాలు, హత్యల వంటి దుర్మార్గాలకు బలయ్యే మహిళలకు న్యాయం వేగంగా జరిగేలా చేయడానికి చట్టాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం అఖిల భారతీయ సమన్వయ సమావేశం (బైఠక్) కేరళలోని పాలక్కాడ్‌లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకూ జరిగింది. దాని ముగింపు సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సునీల్ అంబేకర్ మాట్లాడారు. కోల్‌కతాలోని ఆర్.జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన హత్యాచారం కేసు గురించి చెబుతూ ‘‘బెంగాల్ సంఘటన గురించి మేం విస్తారంగా చర్చించాము. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్న అటువంటి సంఘటనల గురించి మా అనుబంధ సంస్థలు వివరించాయి. మన దేశంలో అలాంటి సంఘటనలకు సంబంధించిన చట్టాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని సంఘం భావిస్తోంది. అలాంటి కేసుల విచారణ వేగంగా పూర్తి చేయడానికి, బాధితులకు న్యాయం వీలైనంత త్వరగా అందించడానికీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి’’ అని అంబేకర్ వివరించారు.
మహిళల భద్రతకు అమిత ప్రాధాన్యం:
ఈ సమావేశం ప్రధాన ఇతివృత్తం మహిళల భద్రత, రక్షణను పెంచడం. దానికి బహుముఖీన వ్యూహాలను ఈ సమావేశంలో చర్చించారు. కోల్‌కతా డాక్టర్ హత్యాచారం నేపథ్యంలో జరిగిన చర్చ సందర్భంగా మహిళల భద్రత విషయంలో రాజీ ప్రసక్తే ఉండకూడదని సంఘం భావిస్తోంది. మహిళలపై జరిగే నేరాల విషయంలో చట్టప్రక్రియ వేగంగా, నిర్ణీత కాలావధిలో పూర్తయేలా ఉండాల్సిన అవసరం ఉందని సంఘం పునరుద్ఘాటించింది.
సమాజంలో శాంతిభద్రత పరిస్థితిని, మహిళల భద్రతనూ పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అదేసమయంలో ఆ విషయంలో సమాజంలో కూడా మార్పు రావలసిన అవసరముందని సంఘం భావన. పురుషులు స్త్రీలను అమిత గౌరవంతో చూడాలి. దానికి, వారి పెంపకంలో జాగ్రత్తలు అవసరం. మహిళల భద్రతతో పాటు, సమాజం మహిళలను చూసే వైఖరి విషయంలోనూ సంఘం దృష్టి కేంద్రీకరిస్తుందని సునీల్ అంబేకర్ చెప్పారు.
మహిళల భద్రత కోసం సంఘం ఐదంచెల కార్యాచరణ ప్రణాళికను ప్రస్తావించింది.
(1) చట్టపరమైన చర్యలు: మహిళల భద్రత విషయంలోనూ, హింస-వేధింపుల నుంచి వారి రక్షణ విషయంలోనూ కఠినమైన చట్టాలుండాలి, వాటిని సమర్థంగా అమలు చేయాలి. మహిళలకు నిజమైన రక్షణ కల్పించడానికి చట్టాలు చేస్తే సరిపోదు, వాటిని కఠినంగా అమలు చేయాలి.
(2) సమాజంలో జాగృతి, కుటుంబ విలువలు: మహిళలను సమాజం చూసే వైఖరి మారవలసిన ఆవశ్యకతను ఈ సమావేశం ఘనంగా ప్రస్తావించింది. సమాజంలో అవగాహన కల్పించడంతో పాటు, సానుకూల కుటుంబ విలువలను బలోపేతం చేయాలి.
(3) విద్యా విలువలు: పాఠశాలలు, కళాశాలల సిలబస్‌లో జెండర్ సెన్సిటివిటీని చేర్చడం చాలా ముఖ్యం. దానివల్ల మహిళలను గౌరవించడం యుక్తవయసులోనే అర్ధమవుతుంది. అది సమగ్ర సమానత్వం కలిగిన సమాజానికి పునాది లాంటిది.
(4) ఆత్మరక్షణ కార్యక్రమాలు: మహిళలకు ఆత్మరక్షణ గురించి విస్తృతంగా శిక్షణా తరగతులు నిర్వహించాల్సిన అవసరం గురించి… మహిళలకు శారీరకంగా, మానసికంగా సాధికారత కల్పించాల్సిన మార్గాల గురించి సమావేశంలో చర్చ సవిస్తరంగా జరిగింది. వాటివల్ల మహిళల్లో విశ్వాసం కలుగుతుంది. అటువంటి శిక్షణ వల్ల మహిళలు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.
(5) ఒటిటి కంటెంట్‌పై నియంత్రణ: ఒటిటి, డిజిటల్ వేదికల్లో కంటెంట్‌ను నియంత్రించాల్సిన అవసరం గురించి సమావేశం చర్చించింది. అటువంటి కంటెంట్‌ను నియంత్రించడం వల్ల సమాజంలో మహిళలను చూసే పద్ధతిలో ప్రతికూలతను తగ్గిస్తుంది, దాని ప్రభావాన్ని నియంత్రిస్తుంది.
చారిత్రక వ్యక్తుల సంస్మరణ:
ధీర మహిళ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలను ఘనంగా జరపాలని సమావేశం ప్రస్తావించింది. భారతీయ సమాజాన్ని మెరుగుపరచడంలో ఆవిడ సేవలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. అలాగే రాణి దుర్గావతి పరిపాలన 500 యేళ్ళ సందర్భాన్ని కూడా వేడుకగా చేయాలని తీర్మానించారు.
దేశాభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యం:
ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సమన్వయ సమావేశంలో సంఘం, దాని అనుబంధ సంస్థలు, సంఘం ప్రేరణతో పని చేస్తున్న సంస్థల దేశవ్యాప్త ప్రతినిధులు 270 మంది పాల్గొన్నారు.
ప్రస్తుత సంవత్సరంలో దేశవ్యాప్తంగా 472 మహిళా సమ్మేళనాలు నిర్వహించారు. వాటిలో సుమారు 6లక్షల మంది మహిళలు పాల్గొన్నారు. వాటిలో మహిళల సమస్యలు, వారి అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించారు.
ఈ సమావేశంలో సంఘ అనుబంధ సంస్థలు, ఆర్ఎస్ఎస్‌తో ప్రేరణ పొందిన సంస్థలూ పాల్గొన్నాయి. ఆ సంస్థలు సాధించిన విజయాలు, ఆ క్రమంలో ఎదుర్కొన్న కష్టనష్టాలూ, గమనించిన పరిశీలనల గురించి ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకున్నారు. క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకున్నారు. జాతీయ భద్రత, సమాజ సమస్యలు, వర్తమాన సంఘటనలు, వివిధ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఆందోళనకర సంఘటనలూ వంటివాటి గురించి చర్చ జరిగింది.
పలు ప్రాంతీయ అంశాల గురించి కూడా సమావేశంలో చర్చించారు. కేరళ వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడడం, తమిళనాడులో మతమార్పిడులు, బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోత వంటి విషయాలను కూలంకషంగా చర్చించారు. రాజస్థాన్‌లోని కఛ్ ప్రాంతంలో సరిహద్దు సమస్యల గురించి ‘సీమా జాగరణ్ మంచ్’ ప్రతినిధులు వివరించారు.
వక్ఫ్ బోర్డులపై పలు ఫిర్యాదులు:
ఆగస్టు 8న లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. 1995నాటి వక్ఫ్ చట్టానికి సవరణలు చేయడం దాని ఉద్దేశం. ఆ చట్టం మన దేశంలోని వక్ఫ్ ఆస్తులను నియంత్రిస్తుంది. ఇటీవలి కాలంలో వక్ఫ్ ఆస్తులపై యాజమాన్య హక్కుల విషయంలో ఎన్నో అవకతవకలు వెలుగుచూసాయి. ఆ చట్టానికి ప్రతిపాదించిన సవరణలు తమ మతపరమైన హక్కులను దెబ్బతీస్తాయని ముస్లిములు ఆందోళనలు వ్యక్తంచేసారు. ఆ అంశం గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
‘‘వక్ఫ్ అంశం సాంకేతికమైనది. దానిగురించి ఈ సమావేశంలో సంక్షిప్తంగా చర్చించాము. వక్ఫ్ బోర్డుల పనితీరు, వాటి కార్యకలాపాలపై ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రత్యేకించి ముస్లిం సమాజం నుంచే పలు ఫిర్యాదులు వస్తున్నాయి. వాటన్నింటినీ అధికారికంగా నమోదు చేసారు. ఆ విషయం ఇప్పుడు పార్లమెంటులో చర్చకు వచ్చింది. మొత్తం మీద ఆ అంశం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు వెళ్ళింది. ఇప్పుడిది బహిరంగ వ్యవహారం. ప్రతీఒక్కరూ తమ స్పందనలను లేదా సందేహాలను జెపిసి ముందు ఉంచవచ్చు. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు కూడా వక్ఫ్ అంశం గురించి తమ అభిప్రాయాలను జెపిసికి తెలియజేస్తాయి’’ అని సునీల్ అంబేకర్ చెప్పారు.
ఈ సమావేశంలో కుల గణన గురించి కూడా చర్చకు వచ్చింది. కుల గణన అనేది సమాజ సంక్షేమం కోసం జరగాలని, అది రాజకీయ పనిముట్టు కారాదనీ ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది.
‘‘కుల గణన చాలా సున్నితమైన అంశం. జాతీయ ఐకమత్యం, సమైక్యత కోసం అది ఎంతో ముఖ్యం. దాన్ని చాలా జాగ్రత్తగా చేపట్టాలి. కొన్నిసార్లు ప్రభుత్వానికి గణాంకాలు కావలసి వస్తాయి. అలాంటి సందర్భాల్లో గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఐతే, కుల గణన కేవలం ఆ కులాల సంక్షేమం కోసమే జరగాలి. కుల గణన సమాచారాన్ని సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కావలసిన సంక్షేమ పనులకు ఉపయోగించడానికి సంఘానికి ఏ అభ్యంతరమూ లేదు. ఏది ఏమైనా కుల గణనను సమాజంలో విభజనలు తేవడానికో, ఎన్నికల్లో ఆధిపత్యం సాధించడానికో వాడకూడదు’’ అని సునీల్ అంబేకర్ చెప్పుకొచ్చారు.
ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సమన్వయ సమావేశానికి (బైఠక్‌కు) ఆ సంస్థ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళె, ఆరుగురు సహ సర్‌కార్యవాహలు డా.కృష్ణగోపాల్, సిఆర్ ముకుంద, అరుణ్ కుమార్, రాందత్, అలోక్ కుమార్, అతుల్ కుమార్ హాజరయ్యారు. భాగవత్‌జీ ప్రధాన ఉపన్యాసం చేసారు. ఇంకా సేవాభారతి, విద్యాభారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, సక్షమ్, వనవాసీ కళ్యాణ ఆశ్రమ్, విశ్వహిందూ పరిషత్, రాష్ట్ర సేవికా సమితి, భారతీయ జనతా పార్టీ, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్ తదితర సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.