విభూతిధారణ కార్యక్రమాన్ని శ్రీశైలం దేవస్థానం పునఃప్రారంభించింది. కరోనా సమయంలో నిలిపివేసిన ఈ కార్యక్రమాన్ని సుమారు నాలుగేళ్ల తర్వాత ప్రారంభించారు. ఆలయ ఈవో పెద్దిరాజు, భక్తులకు విభూతిధారణ చేశారు.
ఆలయ సంస్కృతీ సంప్రదాయాలపై భక్తులందరికీ మరింత అవగాహన కల్పించే సంకల్పంతో విభూతిధారణ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించామని ఈవో వివరించారు. శివసేవకుల సాయంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. నుదుట బొట్టు పెట్టుకోవడం సనాతన సంప్రదాయంలో భాగమన్నారు. విశిష్టమైన ఆర్ష సంస్కృతికి బొట్టు ప్రతీకగా నిలుస్తుందన్నారు.
విభూతికి ఎంతో మహిమ ఉంటుందని ఎన్నో పురాణాల్లో పేర్కొన్న విషయాన్ని ఈవో పెద్దిరాజు గుర్తు చేశారు. పవిత్రతను కలిగించడంతో పాటు, అరిష్టాలన్నింటిని తొలగించి సకల శుభాలను కలిగిస్తుందన్నారు.
విభూతిధారణతో సమస్త సంపదలు చేకూరుతాయని అనేక సనాతన గ్రంథాల్లో పేర్కొన్నారని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వీరయ్య, ఏఈవోలు ఎం హరిదాసు, ఐఎన్‌వీ మోహన్, పీఆర్‌వో శ్రీనివాసరావు, పర్యవేక్షకులు హిమబిందు పాల్గొన్నారు.