ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఉత్తప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుంచి హర్యానాలోని భివానీకి వెళుతోన్న కాళింది ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్, పెట్రోలు సీసాలు ఉంచి రైలును తగలబెట్టే కుట్ర వెలుగు చూసింది. ప్రయాగ్‌రాజ్ నుంచి భివానీ వెళుతోన్న కాళింది ఎక్స్‌ప్రెస్ లోకో ఫైలెట్ పట్టాలపై అనుమానాస్పద వస్తువును గుర్తించడంతో ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. అయినా వేగంగా ఉన్న రైలు సిలిండర్‌ను ఢీకొని ఆగిపోయింది. గ్యాస్ సిలిండర్ ఎగిరి 50 మీటర్ల దూరంగా పడింది. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
రైల్వే పోలీసుల విచారణలో భారీ కుట్ర వెలుగు చూసింది. గ్యాస్ సిలిండర్ పట్టాలపై ఉంచడంతోపాటు, అక్కడే పెట్రోలు సీసాలు, అగ్గిపెట్టెను కూడా గుర్తించారు. ఉగ్రవాదుల కుట్రగా అనుమానిస్తున్నారు. కేంద్ర ఏజన్సీలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయి. నిందితులను వదిలేదే లేదని రైల్వే అధికారులు హెచ్చరించారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.