కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారం ఘటపై బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. మొదటి నుంచి పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు చెరిపేయాలని చూశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. చనిపోయిన కూతురి మృతదేహం చూపించకుండానే దహన సంస్కారాలకు ఒత్తిడి తెచ్చారని, డబ్బు ఆశ చూపారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హత్య ఘటన తరవాత మొదటి ఐదు రోజులు బెంగాల్ పోలీసులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. కేసులో పురోగతి లేకపోవడంతో కోల్‌కతా హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది.
ఈ కేసులో ఇప్పటికే నిందితుడు రాయ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆర్జి కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను కూడా సీబీఐ అరెస్ట్ చేసి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. సామూహిక అత్యాచారం జరిగిందనే వార్తల్లో నిజం లేదని సీబీఐ తేల్చి చెప్పింది. డాక్టర్ హత్య తరవాత దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయ.
డాక్టర్ హత్యను నిరసిస్తూ 25 దేశాల్లోని భారతీయులు తీవ్ర నిరసనలు తెలిపారు. కేసును త్వరగా తేల్చాలని, నిందితుడికి ఉరి శిక్ష విధించాలంటూ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. మరో వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి సీబీఐ చార్జిషీటు నమోదు చేయనుంది.