గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. విజయవాడలో రాజ్ భవన్ కు వెళ్ళిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో వరద ప్రభావం, సహాయ చర్యలు గురించి గవర్నర్ కు వివరించారు.
బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గురించి తెలియజేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న పునరావాస చర్యలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సహాయ చర్యలను సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించడాన్ని అభినందించారు.
అంతకు ముందు రాష్ట్రప్రభుత్వం వరద నష్టంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారీ వర్షాలు, వరదల కారణంగా 45 మంది చనిపోయారని నివేదికలో రాష్ట్రప్రభుత్వం పేర్కొంది.
ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది ప్రాణాలు కోల్పోగా గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు, ఏలూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు.రాష్ట్ర వ్యాప్తంగా 1,81,53,870 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు నివేదికలో రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. 19,686 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం వాట్లిల్లగా 3,913 కి.మీ మేర ఆర్అండ్బీ రహదారులు ధ్వంసమయ్యాయి.