ఆఫ్రికా దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తోంది. భారత్‌లోనూ ఓ అనుమానిత కేసు నమోదైంది. ఓ యువకుడిలో ఎంపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఎంపాక్స్ అధికంగా ప్రబలుతున్న దేశం నుంచి సదరు యువకుడు వచ్చినట్లు ట్రావెల్ హిస్టరీ ద్వారా తెలుస్తోందది. అనుమానిత రోగిని ఐసోలేషన్‌లో ఉంచామని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. .
రోగి నుంచి శాంపిల్స్ సేకరించి నిర్ధరణ కోసం ల్యాబ్ కు పంపారు. వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోందని కేంద్రం పేర్కొంది.
ఆఫ్రికా దేశాల్లో ఎంపాక్స్ ఆందోళనకర రీతిలో ఉంది. 18 వేల అనుమానిత కేసులు, 926 మరణాలు సంభవించాయి. కొత్తరకం కేసులు ఇప్పటివరకు 258 నమోదైనట్లు WHO వెల్లడించింది.
బురుండి, రువాండా, కెన్యా, ఉగాండాతోపాటు స్వీడన్, థాయ్‌లాండ్ దేశాల్లోనూ ఈ కేసులు బయటపడ్డాయి. భారత్‌లో ఈ ఏడాది మార్చి తర్వాత కేసులు నమోదు కాలేదు.