బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆమదాలవలస, గార, శ్రీకాకుళం మండలాల్లో 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 2నుంచి 6 సెంటీమీటర్ల వాన కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారం ఉదయానికి జిల్లా జిల్లా మొత్తం మీద 144 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.
నాగావళి, వంశధార నదులలోకి నెమ్మదిగా నీరు చేరుతోంది. వాగులు, కాలువలు పొంగుతున్నాయి. లావేరు మండలం బుడతవలస గ్రామం వద్ద వాగులో వ్యాను కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. మడ్డువలస రిజర్వాయర్ కు సువర్ణముఖి వేగవతి నదుల నుంచి భారీగా వరద చేరడంతో ఆరు గేట్లు ఎత్తారు.
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు విశాఖ గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రామకృష్ణనగర్ కాళీమాత గుడి మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పలు నివాసాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే గణపతి బాబు ఆదేశాల మేరకు అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.