పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్ ప్రజలు భారత్‌లో చేరడానికి సిద్దంగా ఉన్నారంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన రామ్‌బన్ నియోజకవర్గంలో ఎన్నికల సభలో ప్రసంగించారు. పీవోకే ప్రజలను పాక్ విదేశీ పౌరులుగా చూస్తోందని స్వయానా ఆ దేశానికి చెందిన సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యానించారని ఆయన గుర్తుచేశారు. జమ్ము కశ్మీర్లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. బీజేపీ ఉన్నంత కాలం జేకేలో 370 ఆర్టికల్ రద్దు అవకాశమే లేదన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసిన తరవాత జమ్ము కశ్మీర్లో ప్రశాంతత నెలకొందన్నారు.
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుపై మంత్రి మండిపడ్డారు. జమ్ము కశ్మీర్‌ను గడచిన ఏడు దశాబ్దాల్లో ఉగ్రవాదుల కేంద్రంగా మార్చారని ఆయన విమర్శించారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలోని 90 స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1న మొత్తం మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరపనున్నారు.