తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. దీంతో ఆ పార్టీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమం అయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ తన పార్టీ పేరును ప్రకటించారు. ఆ తర్వాత జెండా, పార్టీ గుర్తును ఆవిష్కరించారు. 2026లో జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తామనిన పార్టీ పేరు ప్రకటన సందర్భంగా విజయ్ తెలిపారు.
విజయ్ రాజకీయ రంగప్రవేశంపై ఎప్పటినుంచో వార్తలు షికార్లు చేయగా ,విజయ్ మక్కళ్ ఇయక్కమ్ చాన్నాళ్లుగా పలు సేవ కార్యక్రమాలు నిర్వహించింది. తాను అనుకున్నట్లు సమాజంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పు తీసుకొచ్చేందుకే పార్టీని స్థాపించినట్లు విజయ్ వివరించారు.
టీవీకే పార్టీ కి ఈసీ గుర్తింపుపై విజయ్ హర్షం వ్యక్తం చేశారు. చట్టపరమైన గుర్తింపు కోసం ఏడు నెలలుగా తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయన్నారు. త్వరలోనే రాష్ట్రస్థాయి సన్నాహాక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.