అగ్రరాజ్యం అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. యెమెన్‌లో అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను హౌతీలు కూల్చివేశారు. యెమెన్‌లోని మారిట్ ప్రాంతంపై ఎగురుతోన్న ఎంక్యూ 9 రీపర్ డ్రోన్‌ను ధ్వంసం చేసినట్లు హౌతీలు ప్రకటించారు. ఈ నిఘా డ్రోన్ 24 గంటల పాటు ఎగర గలదు. దాదాపు రూ.235 కోట్ల విలువైన ఈ నిఘా డ్రోన్‌ను ఎలా కూల్చారనే విషయం మాత్రం వెల్లడికాలేదు. పాలస్తీనా పౌరులు, యెమెన్ కోసం హౌతీలు పోరాడుతూనే ఉంటారని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.
పదేళ్ల కిందటే యెమెన్ రాజధాని సనాను హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి యెమెన్ రాజధాని హౌతీల అధీనంలో ఉంది. ఇటీవల ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలను హౌతీలు అదుపులోకి తీసుకుంటున్నారు. అమెరికాకు చెందిన ఓ వాణిజ్య నౌకను ఇటీవల హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. తరచూ వాణిజ్య నౌకలపై దాడులకు దిగుతున్నారు. అంతర్జాతీయ వాణిజ్యానికి హౌతీలు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. వేలాది క్షిపణులను కూడా హౌతీలు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. ఓ వాణిజ్య నౌకపై క్షిపణులతో కూడా హైతీలు దాడులకు తెగబడ్డ సంగతి తెలిసిందే.