వరదకు శాశ్వత పరిష్కారం చూపుతామని మున్సిపల్ మంత్రి నారాయణ వెల్లడించారు. బుడమేరు వరద మరోసారి విజయవాడను ముంచకుండా ఉండేలా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడతామని చెప్పారు. వరద క్రమంగా తగ్గుతోందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలసి నారాయణ పర్యటించారు. సింగ్‌నగర్ ప్రాంతంలో సాయంత్రానికి వరద తగ్గుతుందన్నారు. బుడమేరు గండ్లు కూడా పూడ్చామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బుడమేరుకు వచ్చే వరదను డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణా నదిలోకి తరలిస్తున్నట్లు నారాయణ తెలిపారు.
బుడమేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. రాబోయే రోజుల్లో విజయవాడను వరద రహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వరద బాధితులకు ఐదు రెట్లు ఎక్కువగా ఆహారం సరఫరా చేయాలని సీఎం చెప్పినట్లు గుర్తుచేశారు. నేటి నుంచి బాధితులకు ఆహార సామగ్రి అందిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో వరద బాధితులకు మరింత సాయం అందిస్తామన్నారు.