బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, వాయుగుండంగా మారినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ వద్ద తీరాన్ని తాకనుంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో కూడా భారీ వర్షం కురవనుంది. దీంతో ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్, మరో ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మున్నేరుకు వరద పెరగడంతో ఎన్టీఆర్ జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఖమ్మం వద్ద మున్నేరు నీటిమట్టం 24 అడుగులకు చేరడంతో అక్కడ రెండో నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నందిగామ వద్ద 65 వేల క్యూసెక్కులు ప్రవహిస్తోంది. ఇది 2 లక్షల క్యూసెక్కులకు చేరితే రహదారిపైకి వరద వచ్చి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. కంచల, దాములూరు, ఐతవరం వద్ద అధికారులు అప్రమత్తమై స్థానికులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో 46.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బొబ్బిలి మండలం కొత్తపెంట వద్ద పెంట చానల్‌కు గండి పడగా బొబ్బిలి వద్ద పారధి వంతెన వద్ద కాజ్ వే ధ్వంసమైంది. రేగిడి మండలంలో సాయన్న గడ్డ, ఆకులవ గడ్డ పొంగాయి.
మడ్డువలసయ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. తాటిపూడి జలాశయం నీటి మట్టం 297 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 294.2 అడుగులకు చేరింది. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది.