మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో ఎనిమిది మంది వ్యక్తులు సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చారు. వారిలో ఐదుగురు క్రైస్తవులు, ముగ్గురు ముస్లిములు ఉన్నారు. చాలాకాలం నుంచీ హిందూధర్మాన్ని విశ్వసిస్తున్నా, లాంఛనంగా హిందూమతంలోకి మారడానికి ఇప్పుడు అవకాశం వచ్చిందని వారు సంతోషం వ్యక్తం చేసారు.
భోపాల్‌లోని ఒక స్థానిక ఆలయంలో ఒక హిందూ సంస్థ ఈ ఘర్ వాపసీ కార్యక్రమం నిర్వహించింది. వైదిక లాంఛనాలతో సంప్రదాయబద్ధంగా హోమం నిర్వహించి ఈ ప్రక్రియను పూర్తిచేసారు. సనాతన ధర్మంలోకి పునరాగమన కార్యక్రమానికి ముందు శుద్ధి కార్యక్రమం జరిగింది. ఆ వ్యక్తులను తొలుత వివిధ నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలు, గోపంచకంతో శుద్ధి చేసారు. తర్వాత వారికి కాషాయ దుస్తులు ధరింపజేసారు. అనంతరం వేదమంత్రాలు చదువుతూ హోమం చేసి సనాతన ధర్మంలోకి వారి పునరాగమన కార్యక్రమం పూర్తి చేసారు.
శనివారం భోపాల్‌లో జరిగిన ఈ ఘర్ వాపసీ కార్యక్రమంలో రఫీక్ అనే వ్యక్తి రవీంద్రగా పేరు మార్చుకున్నాడు. ఫర్హాత్ పర్వీన్ అనే మహిళ రశ్మిగా పేరు మార్చుకుని, రవీంద్రను హిందూ పద్ధతిలో వివాహం చేసుకుంది. డానిష్ దక్షిత్‌గా మారాడు. విక్టర్ వీరేంద్ర అయ్యాడు. పీటర్ ఫూల్‌చంద్ అయ్యాడు. కెరోలిన్ తన పేరును కిరణ్‌గా మార్చుకుంది. ఐలీ తన పేరును అన్షుగా మార్చుకుంది. మేరీ ఇకపై మేఘ అని పిలవబడుతుంది.
మధ్యప్రదేశ్‌లో ఈ ఘర్‌వాపసీ కొంతకాలంగా ఇండోర్, మంద్‌సోర్ జిల్లాల్లో పుంజుకుంటోంది. అదే క్రమంలో ఇప్పుడు భోపాల్ జిల్లాలోనూ ఇతర మతస్తులు హిందూధర్మంలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
సెప్టెంబర్ 4న మంద్‌సోర్ జిల్లాలో ఘర్‌వాపసీ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని ధమ్‌నార్ ప్రాంతానికి చెందిన మెహనాజ్ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో పాటు సనాతన ధర్మాన్ని స్వీకరించింది. ఇప్పుడామె పేరు మీనాక్షి. ఆమె పిల్లలు ఫర్హాన్, షెహజాద్‌లకు లవ, కుశ అని పేర్లు పెట్టింది. మెహనాజ్ తాను సనాతన ధర్మంలోకి ఎందుకు మతంమారిందో వివరించింది. ‘‘ఇప్పుడు నాకు మీనాక్షి అనే కొత్త పేరు వచ్చింది. నాకు మొదటినుంచీ సనాతన ధర్మం మీద విశ్వాసం ఉంది. మా పాత ఇంట్లో మహిళలకు గౌరవం అనేదే లేదు. నా భర్త నన్ను చాలా హింసించేవాడు. అందుకే నేను హిందువుగా మారాలని నిర్ణయించుకున్నాను. నాకు చైతన్యసింగ్ రాజ్‌పుత్ గురించి తెలిసింది. ఆయనను కలిసాను. సనాతన ధర్మంలోకి తిరిగి చేరడానికి ధార్మికమైన, చట్టపరమైన ప్రక్రియ గురించి ఆయన వివరించారు. అలా నేను హిందూ ధర్మాన్ని చట్టపరంగా స్వీకరించాను’’ అని వివరించింది.
మంద్‌సోర్‌లో ఘర్‌వాపసీ కార్యక్రమం 2022లో మొదలైంది. షేక్ జాఫర్ షేక్ అనే వ్యక్తి చైతన్యసింగ్ రాజ్‌పుత్‌గా మారాడు. అప్పటినుంచీ ఆయన 47మందిని సనాతన ధర్మంలోకి తీసుకొచ్చారు. వారిలో 38మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు.