వరద ముంపు నుంచి విజయవాడ ఇప్పిడిప్పుడే బయట పడుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేయడంతో వరద కృష్ణా నదిని చేరుతోంది. అయితే విజయవాడలోని 16 డివిజన్లలోని 96 కాలనీలు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఒక్కసారి బుడమేరు వరద పెరగడంతో ప్రజలు ఆందోళన చెందారు. తరవాత గండ్లు పూడ్చి వేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. బుడమేరు నుంచి 8 వేల క్యూసెక్కుల వరదను కృష్ణా నదికి తరలిస్తున్నారు.
విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగం అందుకున్నాయి. వీధుల్లో రెండగుల మేర వరద నీరు నిలిచింది. ఇళ్లను ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేస్తున్నారు. బాధితులకు ఆహార సామాగ్రి అందిస్తున్నారు. పాలు, కూరగాయలు, భోజనం ఉచితంగా సరఫరా చేస్తున్నారు. హరేరామ హరేకృష్ణ సమాజం 10 లక్షల ఆహార పొట్లాలు అందించి బాధితులకు అండగా నిలిచింది.
ఎడతెరపి లేని వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. శుక్రవారం నుంచి కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సెల్లార్లలోని నీటిని పంపులతో తోడిపోస్తున్నారు. రాష్ట్రంలోని 117 మునిసిపాలిటీల నుంచి 10 వేల మంది పారిశుధ్ధ్య కార్మికులను రంగంలోకి దింపారు.
శుక్రవారం సాయంత్రం వరద పెరగడంతో సింగ్ నగర్, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిపివేశారు. ప్రభుత్వం చేస్తున్న వరద సాయంపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు పోలీసులను ఆదేశించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.