అధికార దుర్వినియోగం కేసులో సస్పెండైన ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ పై కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) నుంచి ఆమెను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఐఏఎస్ (ప్రొబేషన్) రూల్స్, 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వివరించింది.
ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడంతో పాటు యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.
సివిల్ సర్వీసెస్ కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో ఫేక్ సర్టిఫికేట్ అందజేయడంతో పాటు నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై యూపీఎస్సీ దర్యాప్తు చేపట్టింది.
నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.