వినాయక చవితి వచ్చిందంటే లంబోదరుడి విగ్రహాలను పలు రూపాల్లో అలంకరిస్తారు. కొందరు కరెన్సీతో, మరికొందరు కూరగాయలతో, ఇంకొందరు మట్టి విగ్రహాలు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు గణపయ్యను కొలుస్తారు. అయితే ముంబైలోని జీఎస్బి సేవా మండల్ మహాగణపతిని 66 కేజీల బంగారంతో రూపొందించారు. ఇందుకు రూ.400 కోట్లతో బీమా చేయించారు. మతుంగా ప్రాంతంలో సేవా మండల్ గణపయ్యను 66 కేజీల బంగారం, 325 కేజీల వెండితో అలంకరించారు. ముందుజాగ్రతగా రూ.400 కోట్లకు బీమా చేయించారు. ఐదు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు.
సేవా మండల్ ఏర్పాటు చేసి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. గత ఏడాది రూ.360 కోట్ల బీమా చేసిన నిర్వాహకులు ఈ ఏడాది దాన్ని రూ.400 కోట్లకు పెంచారు. కేవలం మండపానికే కాదు. గణపయ్యను దర్శించుకునే భక్తులకు కూడా బీమా చేయించడం విశేషం.