విజయవాడను అల్లాడించిన బుడమేరు గండ్ల పూడ్చివేత విజయవంతమైంది.రాష్ట్రప్రభుత్వ పరిధిలోని ఏజెన్సీ లకు తోడు ఆర్మీ రంగంలోకి దిగడంతో గండ్లును త్వరగా పూడ్చగల్గారు. అయితే వీటిని మరింత ఎక్కువ ఎత్తులో పటిష్ఠం చేయాల్సి ఉంది. దానిని కూడా రెండుమూడు రోజుల్లో పూర్తి చేయబోతున్నారు.
మూడో గండి 100 మీటర్లు పొడవు 10 మీటర్లో లోతు ఉండటంతో ఆర్మీ సాయం తీసుకున్నారు. వారు ప్రత్యేక టెక్నాలజీ వాడి గండిని పూడ్చారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. గండ్ల పూడ్చివేత పనులను మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పూడ్చివేత పనులు సాగాయి. బుడమేరు ఉద్ధృతంగా ఉన్నప్పుడే రెండు గండ్లు పూడ్చారు.
చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్‌కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల్లో పాల్గొన్నారు.
బుడమేరు గండ్లను విజయవంతంగా పూడ్చిన మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొని పనులు పూర్తి చేశారని కొనియాడారు.
కంట్రోల్ రూమ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు 24 గంటలు పనులు పర్యవేక్షించారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధితో నిరంతరం కష్టపడ్డామన్నారు.