తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏపీ, తెలంగాణలోని ప్రతీ వీధిలో ప్రత్యేక పందిళ్ళు వేసి వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. భాద్రపద చవితి సందర్భంగా నేడు మొదటి రోజు అందరూ మహాగణపతిని ఆరాధించారు. విఘ్నాలు తొలిగి జీవితంలో విజయాలు సాధించేలా ఆశీర్వదించాలని వేడుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు, మఠాల్లో కూడా శ్రీ గణేశుడి నవరాత్రులు ప్రారంభం అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, విజయవాడ కలెక్టరేట్ లోనే వినాయక చవితి జరుపుకున్నారు. వరద సహాయ చర్యల్లో భాగంగా కృష్ణా కలెక్టరేట్ లోనే వారం రోజులుగా బస చేస్తున్న చంద్రబాబు, నేడు అక్కడే అధికారులు, మంత్రులతో కలిసి గణపతి స్వామికి పూజలు చేశారు. అనంతరం వరద సహాయ చర్యలను పర్యవేక్షించారు.
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేషుడికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తొలిపూజ నిర్వహించారు. 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి రూపంలో మహాగణపతి భక్తులను అనుగ్రహిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఆలయానికి ప్రత్యేక అలంకరణ చేశారు. స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
బిక్కవోలులో వినాయక చవితి ఉత్సవాలు భక్తశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీలక్ష్మీ గణపతి స్వామి దేవాలయం వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి వారికి గోదావరి జలాలు, పంచామృతాలతో కూడిన అభిషేకాలు నిర్వహించారు.