హర్యానా శాసనసభ ఎన్నికలు కొద్దిరోజుల్లో జరగనున్న ఈ తరుణంలో ప్రఖ్యాత మల్లయోధులు బజరంగ్ పూనియా, వినేష్ ఫోగాట్ నిన్న శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశమైన కొద్దిసేపటికే వారిద్దరూ కాంగ్రెస్‌లో తమ చేరికను ప్రకటించారు. అధికార ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు, ఆందోళనలు చేయడంలో వారి పాత్ర అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో వారిద్దరి రాజకీయ రంగప్రవేశం ఆసక్తి కలిగిస్తోంది.
ఆరోపణలు, వివాదాలు:
వినేష్ ఫోగాట్, బజరంగ్ పూనియా రాజకీయ రంగప్రవేశం వివాదాలతో కూడుకున్నదే. ఆ మల్లయోధులిద్దరూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినవారే. బ్రిజ్‌భూషణ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్రమైనవే, వాటిమీద విచారణ జరిగి తీరాల్సిందే. అయితే వినేష్, బజరంగ్‌లు ప్రజా సానుభూతి కోసం ఆందోళనలు నిర్వహించిన తీరు విమర్శల పాలయ్యింది. న్యాయం కోసం పోరు పేరుతో మొదలుపెట్టిన ఆందోళనలను వారు తమ రాజకీయ ప్రవేశానికి వేదికగా వాడుకున్నారన్న అపవాదులున్నాయి. వినేష్, బజరంగ్ తరచుగా కాంగ్రెస్ ప్రాయోజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, వారికి కాంగ్రెస్ నాయకులు మద్దతు ఇవ్వడం దానికి నిదర్శనంగా నిలిచాయి.
కాంగ్రెస్‌లో చేరే సమయంలో వినేష్ ఫోగాట్ ‘‘మహిళలపై అన్యాయాలు, దుష్ప్రవర్తనకు వ్యతిరేకంగా పోరాడే పార్టీలో చేరుతున్నందుకు గర్వంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రకటన బీజేపీ లక్ష్యంగానే ఉందన్నది సుస్పష్టం. అయితే కాంగ్రెస్ చరిత్రను ఆమె ఉద్దేశపూర్వకంగా విస్మరించిందన్నదీ కనిపిస్తూనే ఉంది. హర్యానా ఎన్నికలకు కొద్ది ముందు వారిద్దరి రాజకీయ రంగప్రవేశం తమకు ఇటీవల వచ్చిన సానుభూతి, కీర్తిప్రఖ్యాతులను సొమ్ము చేసుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.
ప్రభుత్వోద్యోగానికి రాజీనామా:
వినేష్ ఫోగాట్ భారత రైల్వేల్లో తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసింది. ‘‘కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్ల’’ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. ఉన్నట్టుండి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం అనుమానాలు కలిగిస్తోంది. ముఖ్యంగా, కాంగ్రెస్‌లో చేరుతున్న సమయంలోనే ప్రభుత్వోద్యోగానికి రాజీనామా ప్రకటించడం గమనార్హం. వినేష్ తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రజల్లో సానుభూతి సాధించడానికే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా, ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నందున ప్రభుత్వోద్యోగం నుంచి తప్పించుకోవడం అనేది ఆమె దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.
వినేష్ ఫోగాట్ తన క్రీడాజీవితాన్ని సైతం వదిలేయడం అనుమానాలను బలపరుస్తోంది. పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడడం వినేష్‌ను అసంతృప్తికి గురిచేసింది. తన కెరీర్ ఒక్కసారి ముగిసిపోవడంతో తలెత్తిన నిరాశ కారణంగానే రాజకీయాల్లోకి ప్రవేశిస్తోంది తప్ప వినేష్ ఫోగాట్ ఉద్దేశం ప్రజాసేవ కాదని విమర్శకులు అంచనా వేస్తున్నారు. తృటిలో ఒలింపిక్ పతకం తప్పిపోవడం, అనర్హత వేటు పడడంతో దేశంలో పెల్లుబికిన సానుభూతిని క్యాష్ చేసుకోవాలన్నది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది.
బజరంగ్ రాజకీయ ఆశలు:
బజరంగ్ పూనియాకు బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత, ఆ పార్టీ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం వంటి అంశాల వల్ల హర్యానా ఎన్నికల్లో అతని ప్రచారం తమకు లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అతన్ని హర్యానా కాంగ్రెస్ ప్రచార కమిటీ సహఛైర్మన్‌గా నియమించే అవకాశం ఉందని సమాచారం. బజరంగ్ పూనియా బద్లీ సీటును ఆశిస్తున్నాడని, వినేష్ ఫోగాట్‌కు జులానా లేక దాద్రీ శాసనసభాస్థానం దక్కవచ్చనీ తెలుస్తోంది. కాంగ్రెస్‌లో బజరంగ్ పూనియా ఒక్కసారిగా ఉన్నతస్థానానికి ఎగబాకడం విశేషం. అతని రాజకీయ ఆశలు, హర్యానాలో మళ్ళీ అధికారం సాధించాలన్న కాంగ్రెస్ వ్యూహంతో కలుస్తుండడం యాదృచ్ఛికం కాదు.
హర్యానా శాసనసభ ఎన్నికల వేళ వినేష్ ఫోగాట్, బజరంగ్ పూనియా రాజకీయ ప్రవేశం చర్చనీయాంశమైంది. ఒకప్పుడు న్యాయం కోసం పోరాడుతున్న క్రీడాకారులుగా చెప్పుకున్న వారు ఇప్పుడు రాజకీయాల్లో చేరడంతో వారిపై అవకాశవాదులన్న ఆరోపణలకు బలం చేకూరింది. ఆందోళనల సమయంలో వారు తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని చెప్పుకొచ్చారు కానీ వారి తాజా చర్యలను చూస్తుంటే అప్పట్లో వారి మాటలు, చేతల వెనుక రాజకీయ అవకాశవాదం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ ఇద్దరు మల్లయోధులూ లైంగిక వేధింపుల ఆరోపణల మాటు బీజేపీని తీవ్రంగా విమర్శించినవారే. అలాంటి వారిద్దరూ ఇప్పుడు కాంగ్రెస్ వేదిక మీదకు రావడాన్ని గమనిస్తే ఆ పార్టీకి సానుకూల ఇమేజ్ తెచ్చిపెట్టడానికి వారు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, కాంగ్రెస్ నాయకులతో కలిసి కనిపించడం, ఆ పార్టీ ప్రచారం చేస్తున్న అంశాలను నెత్తికెత్తుకోవడం వంటివి చూస్తుంటే వారికి ప్రజాసేవ కంటె వ్యక్తిగత ప్రయోజనాల పైనే ధ్యాస ఉందని అర్ధమవుతోంది.
వ్యక్తిగత పోరాటాలను రాజకీయాలకు వాడుకోవడం:
వినేష్ ఫోగాట్, బజరంగ్ పూనియాలు కాంగ్రెస్‌లో చేరాలన్న నిర్ణయాన్ని పరిశీలిస్తే ఇటీవలి వారి పోరాటాలు, వాటి ఫలితంగా వారు ప్రజల్లో సాధించిన సానుభూతిని వాడుకోడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అర్ధమవుతోంది. వారిద్దరినీ న్యాయం కోసం పోరాడిన మహానుభావుల్లా కాంగ్రెస్ చిత్రీకరిస్తుండడం, వారిని బాధితులుగా చూపి ఆ సానుభూతి మీద ఓట్లు సంపాదించుకోడానికి ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నంగా స్పష్టంగా తెలుస్తోంది. వారి ఆందోళనలు న్యాయం కోసం నిజంగా చేసిన పోరాటాలుగా మొదలైనా, ఇప్పుడు తమ రాజకీయ లక్ష్యాలను చేరుకోడానికి వారు ఆ ఆందోళనలను వాడుకుంటున్న సంగతి ఇట్టే తెలుస్తోంది.
భారత క్రీడారంగానికి వినేష్ ఫోగాట్, బజరంగ్ పూనియా చేసిన సేవలు గొప్పవి అనడంలో సందేహమే లేదు. వారి కృషి వల్లే క్రీడారంగంలో వేధింపుల మీద దేశం దృష్టి ప్రసరించిందనడంలో అనుమానమే లేదు. అయితే వారి గతపు ఘనతలను ప్రస్తుతం వారి రాజకీయపుటడుగులు దిగజార్చాయన్నదీ అంతే నిజం. కీలకమైన రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్‌లో చేరాలన్న వారి నిర్ణయం వారి గతకాల ప్రవర్తనపై అనుమానాలు కలగజేస్తోంది.