ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం మొయిరాంగ్‌లో మిలిటెంట్లు అత్యాధునిక లాంగ్-రేంజ్ బాంబును పేల్చారు. ఆ దాడిలో ఒక సాధారణ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు, మరో ఐదుగురు గాయపడ్డారు.
బిష్ణుపూర్ జిల్లాలో కొద్దిరోజుల క్రితం డ్రోన్లతో రాకెట్లు ప్రయోగించి దాడులు చేసారు. ఆ ఘటన మరువక ముందే అదే జిల్లాలోని మొయిరాంగ్‌లో ఈ దాడి జరగడంతో స్థానిక ప్రజల భద్రతపై ఆందోళన నెలకొంది. బాంబు పేలడంతో 70 ఏళ్ళ వృద్ధుడు ఆర్‌కె రాబెయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే ఘటనలో 13ఏళ్ళ బాలిక సహా ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. రాష్ట్రప్రభుత్వ బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. ఆ దాడికి బాధ్యత తమదేనంటూ ఇప్పటివరకూ ఏ మిలిటెంటు సంస్థా ఎలాంటి ప్రకటనా జారీ చేయలేదు.
ఈ బాంబు దాడి ఘటనలతో మణిపూర్ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మొయిరాంగ్, పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అత్యాధునిక బాంబులు, డ్రోన్లతో రాకెట్ దాడులు భద్రతా బలగాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. మిలిటెంట్లకు విదేశీ శక్తులు సహకరిస్తున్నాయా అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. అటువంటి దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్లను తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు తమ వ్యూహాలను పునస్సమీక్షించుకుంటున్నాయి.
తాజా హింసాకాండతో మణిపూర్ వాసులు భయభ్రాంతులయ్యారు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా శాంతి సుస్థిరతలను పునరుద్ధరించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు.