హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో గురువారం నాడు హిందువులు పెద్దసంఖ్యలో సంజౌలీ మసీదు దగ్గర ఆందోళన చేపట్టారు. అక్రమంగా మసీదు నిర్మాణం చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ప్రజలు, హిందూసంఘాల సభ్యులు, బీజేపీ కార్యకర్తలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిమ్లాలోకి బంగ్లాదేశీలు, రోహింగ్యాలు పెద్దసంఖ్యలో అక్రమంగా చొరబడుతుండడంపై వారు ఆందోళన వ్యక్తం చేసారు. విదేశీయుల చొరబాట్ల వల్ల సిమ్లాలో సామాజిక అశాంతి పెరిగిపోతోందని వాపోయారు. నగరంలో చొరబాటుదార్లు ఎంతమంది ఉన్నారు, వారి మూలాలు ఎక్కడివి అన్న అంశంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసారు.
సిమ్లాలోని సంజౌలీ ప్రాంతంలో స్థానిక నాయకులు సహా పలువురు ప్రజలు తమ ఆందోళనలను వ్యక్తం చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. సంజౌలీలో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, నగర పాలక సంస్థ అధికారులు కిమ్మనకుండా మౌనంగా ఉండిపోయారంటూ మండిపడ్డారు.
సిమ్లాలోని సంజౌలీ ప్రాంతంలో మసీదు అక్రమ నిర్మాణం రచ్చ గత వారం పది రోజులుగా కొనసాగుతూనే ఉంది. సంజౌలీ చేరువలోని మల్యానా ప్రాంతంలో ఒక వ్యాపారిపై ముస్లిముల దాడితో ఆ గొడవ మరింత ముదిరింది. సెప్టెంబర్ 1న పదుల సంఖ్యలో ప్రజలు సంజౌలీ ప్రాంతంలో సమావేశమయ్యారు. అక్కడ అక్రమంగా, చట్టవిరుద్ధంగా నిర్మించిన మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేసారు. మల్యానాలో స్థానిక వ్యాపారిపై ముస్లిములు దాడి చేసిన ఘటనలో హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
ఆందోళనకారులు మువ్వన్నెల జెండాలు చేతిలో పట్టుకుని, చట్టవిరుద్ధ నిర్మాణాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ‘‘ఈ మసీదును చట్టవిరుద్ధంగా నిర్మించారు. మసీదు నాలుగు అంతస్తులూ చట్టవిరుద్ధమే. మేము ఏదైనా నిర్మాణం చట్టవిరుద్ధంగా చేపడితే వెంటనే కూల్చివేస్తారు. ఇక్కడ అక్రమంగా మసీదు కట్టి పదేళ్ళవుతోంది, ఇప్పటివరకూ ఎలాంటి చర్యా తీసుకోలేదు. ఈ మసీదును వెంటన పడగొట్టేయాలి’’ అని అంకుశ్ చౌహాన్ అనే వ్యక్తి చెప్పుకొచ్చారు.
ఈ ఆందోళనల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైతం పాల్గొనడం విశేషం. ‘‘ఇక్కడ మొత్తం హిందూ సనాతన ధర్మ అనుయాయులు అందరూ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. దానికి పార్టీ రాజకీయాలతో సంబంధం లేదు. బీజేపీ లేదా కాంగ్రెస్ అని కాదు, ఈ అక్రమ కట్టడానికి వ్యతిరేకంగా హిందూ సమాజం పోరాడుతోంది. ఒక హిందూ సోదరుడిపై కొందరు ముస్లిం వ్యక్తులు దాడిచేసి గాయపరిచారు. అసలు ఈ ప్రాంతంలో ముస్లిములు ఎక్కణ్ణుంచి వస్తున్నారు? వారు బంగ్లాదేశీయులా లేక రోహింగ్యాలా? ఆ విషయంపై విచారణ జరగాలి’’ అని అంకుశ్ చౌహాన్ డిమాండ్ చేసారు.
హిందూ జాగరణ్ మంచ్ హిమాచల్ ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కమల్ గౌతమ్ మాట్లాడుతూ ‘‘అక్రమ చొరబాటుదార్లు తలదాచుకోవడం కోసం చట్టవిరుద్ధంగా నిర్మించిన ఈ మసీదును వాడుకొంటున్నారు. దాన్ని కూల్చివేయవలసిందే. కనబడిన ఖాళీ స్థలాన్నల్లా ఆక్రమించేస్తున్న వక్ఫ్ బోర్డును రద్దు చేయవలసిందే. వక్ఫ్ బోర్డు ఆక్రమించిన భూములను, ఇతర ఆస్తులనూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవలసిందే’’ అని డిమాండ్ చేసారు.
దేవభూమి క్షత్రియ సంఘటన అధ్యక్షుడు రుమీత్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ సిమ్లాలో అక్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలన్న పిలుపుకు సనాతన ధర్మాన్ని పాటించే వారందరూ స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సనాతనవాదుల ఐకమత్యాన్ని చాటినందుకు అభినందించారు.