బుడమేరు మూడో గండి పూడ్చివేతే ప్రధాన లక్ష్యం
బుడమేరుకు పడిన మూడో గండిని ఈ రాత్రికే పూడ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వరద ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన చంద్రబాబు , బుడమేరుకు పడిన గండ్లు పూడ్చడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యం అన్నారు.
సైన్యం సాయంతో గండి ఎలాగైనా సరే ఈ రాత్రికే పూడ్చాలని సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తున్నామని తెలిపారు. వరద ప్రాంతాల్లో 72 శాతం పారిశుద్ధ్య పనులు పూర్తి చేశామన్నారు.
బాధితులకు 3.12 లక్షల ఆహార ప్యాకెట్లు, 11.5 లక్షల వాటర్ బాటిళ్ళను ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మెకానిక్కులు, ఇతర టెక్నీషియన్ల అవసరం ఉందన్నారు.
తెలుగు రాష్ట్రాలకు రూ. 3,300 కోట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించిందనే విషయం గురించి తనకు సమాచారం లేదని చంద్రబాబు అన్నారు. వరద నష్టంపై రేపు కేంద్రానికి నివేదిక అందజేస్తామన్నారు. కేంద్రంతో పాటు పారిశ్రామికవేత్తలు, ప్రజలు స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరారు.