వీడియోకాన్‌కు అక్రమంగా రుణాలు మంజూరు చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముంబై హైకోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడంపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2012లో వీడియోకాన్‌కు రూ.3250 కోట్ల రుణం మంజూరు చేశారు. ఆ తరవాత అది నిరర్థక ఆస్తిగా మారింది. వీడియోకాన్‌కు రుణం మంజూరు చేసిన అప్పటి ఐసిఐసిఐ బ్యాంకు సీఈవో అవినీతికి పాల్పడినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ దూత్, చందాకొచ్చర్‌కు చెందిన న్యూ పవర్‌లో భారీ పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ గుర్తించింది. రుణం మంజూరు చేసినందుకు ప్రతిఫలంగా ఈ పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ గుర్తించింది.
చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌పై అవినీతి, మనీలాండరింగ్ కేసులు నమోదయ్యాయి. దీనిపై ముంబై హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్‌కు కూడా గత ఏడాది ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటామని కోర్టు తెలిపింది.