ఆర్జి కర్ ఆసుపత్రి డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరగలేదని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగిందంటూ చేసిన ప్రచారంలో నిజం లేదని దర్యాప్తులో తేలినట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు. నిందితుడు సంజయ్ రాయ్ ఆసుపత్రిలో పలు మార్లు తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోందన్నారు. రాయ్ ఒక్కడే దారుణానికి దిగినట్లు సీబీఐ వెల్లడించింది. త్వరలో అభియోగాలు నమోదు చేస్తామని ప్రకటించారు.
ఘటన జరిగిన తరవాత బెంగాల్ పోలీసులు ఐదు రోజుల పాటు కేసు విచారణ చేపట్టారు. ఆ తరవాత కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐకి కేసు బదిలీ అయింది. అయితే కేసును సుదీర్ఘంగా దర్యాప్తు జరపడంపై సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. నిందితుడికి వెంటనే కఠిన శిక్ష విధించడంలో కేంద్రం విఫలమైందని ఆమె తప్పుపట్టారు.
బెంగాల్ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచి ఆగమేఘాలపై తీసుకువచ్చిన అపరాజిత బిల్లుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అస్సాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బిల్లులను కాపీ పేస్టు చేసినట్లుగా ఉందని గవర్నర్ విమర్శించారు. బాధితురాలు కోమాలోకి వెళ్లినా, మరణించినా నిందితులకు మరణశిక్ష, పెరోల్‌కు అవకాశం లేని జీవిత ఖైదు విధించాలని అపరాజిత బిల్లులో పొందుపరిచారు. వెంటనే గవర్నర్ ఆమోదించేలా ప్రతిపక్షాలు ఒత్తిడి తేవాలంటూ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.