విజయవాడకు బడమేరు గండం ఇప్పట్లో వీడేలా కనపడటం లేదు. శివారు ప్రాంతాలైన రాయనపాడు, సింగ్ నగర్ లోకి మళ్ళీ వరద చేరింది. గురువారం అర్ధరాత్రి నుంచి వరద పోటు పెరిగింది. దీంతో మళ్లీ నివాసాల ముంగిట్లోకి నీళ్ళు చేరాయి. రాయనపాడు రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌లపైకి వరద చేరడంతో పలు రైలు సర్వీసులు రద్దు అయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు.
దీంతో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు బాధితులకు పాలు, ఇతర ఆహార పదార్థాలు అందిస్తున్నారు.
అజిత్ సింగ్‌నగర్‌లోని పలు ప్రాంతాల్లోనూ అదేపరిస్థితి ఉంది. ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. రామకృష్ణాపురం, రాజరాజేశ్వరపేట ప్రాంతాల్లో వరద ప్రవాహం కారణంగా సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్ళు అందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా విజయవాడ నగరపాలక సంస్థతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది శానిటేషన్ చేస్తున్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సంచార రైతు బజార్లను ఏర్పాటు చేసి రూ.10, రూ.5కే కూరగాయలు అందజేస్తున్నారు.