ఆర్జి కర్ మెడికల్ కళాశాల డాక్టర్ హత్య,అత్యాచారం కేసులో మొదటి సారిగా ఈడీ రంగంలోకి దిగింది. ఆర్జి కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఘోష్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా చేసిన సమయంలో అనేక అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. మందుల కొనుగోలు, అనాధ శవాలు అమ్మేయడం వద్ద నుంచి మెడికల్ కళాశాలలో షాపులను కౌన్సిల్ అనుమతి లేకుండా లంచాలు తీసుకుని అయిన వారికి కట్టబెట్టినట్లు తేలింది. దీనిపై లోతుగా విచారణ జరిపేందుకు ఈడీ రంగంలోకి దిగింది. మెడికల్ కాలేజీ డేటా ఎంట్రా ఆపరేటర్ ప్రసూన్ చటర్జీ నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
సందీప్ ఘోష్ అవినీతిపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసింది. వందల కోట్ల అవినీతి వెలుగు చూడటం, శవాలను అమ్మేయడం, విదేశాలకు నిధులు తరలించినట్లు ఆరోపణలు రావడంతో ఈడీని రంగంలోకి దింపారు. ఇప్పటికే ఘోష్‌ను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధించింది. ఘోష్ ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నాడు. జైల్లో అతను ఆహారం తీసుకోవడం లేదని తెల్లవారుజామున 4 గంటల వరకు జైలు గదిలో అటు ఇటూ తిరుగుతున్నట్లు గుర్తించారు.