తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన క్లెయిమ్స్ సెటిల్మెంట్లు చేయాలని బీమా సంస్థలకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఉత్తర్వులను బీమా కంపెనీలకు జారీ చేసింది. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని సూచించింది. ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం ద్వారా క్లెయిమ్ సెటిల్మెంట్లు త్వరగా పూర్తి చేస్తే బాధితులకు ఉపశమనం లభిస్తుందని తెలిపింది.
పాలసీదారులు సంప్రదించాల్సిన నోడల్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నంబర్‌లను అందరికీ బహిరంగ ప్రకటన ద్వారా తెలపాలని కోరింది. విపత్తులో నష్టపోయిన వారిని ఆదుకోవడానికి, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించింది.