నటి కాదంబరి జత్వానీ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు సహా, వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌పై లిఖితపూర్వకంగా విజయవాడ సీపీకి ఫిర్యాదు అందించారు. తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడంతోపాటు, తన తల్లిదండ్రులను కూడా చిత్రహింసలకు గురిచేశారని ఆమె ఆరోపించారు. అప్పటి విజయవాడ సీపీ కాంతారాణా, నిఘా విభాగం మాజీ అధిపతి సీతామారాంజనేయులు, విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్ని తనను హింసించారని జత్వానీ ఫిర్యాదు చేశారు.
తన వద్ద నుంచి ఫోన్లు, ల్యాప్ ట్యాపులు, ఎలక్ట్రానిక్ డివైస్‌లు స్వాధీనం చేసుకున్నారని, ఇంత వరకు వాటిని ఇవ్వలేదని ఆమె ఫిర్యాదు చేశారు. 17 క్రిమినల్ కేసులున్న కుక్కల విద్యాసాగర్ తనపై తప్పుడు ఫిర్యాదు చేయగానే, తనను, తన తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చారని వాపోయారు. ముంబైలో తాను ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలంటూ బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులో తెలిపారు.
సాధ్యమైనంత త్వరగా పోలీసులు కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలని కోరారు. తన వద్ద స్వాధీనం చేసుకున్న ఫోన్లు వెంటనే తిరిగి ఇవ్వాలని కోరారు. తన కుంటుంబానికి చెందిన బ్యాంకు ఖాతాలు సీజ్ చేశారని వాటిని విడిపించాలన్నారు.