మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో తాజాగా మరో అరాచకం వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ సిద్దార్థ్నగర్కు చెందిన ఓ పేద మహిళ తన భర్తకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఘజీపూర్లోని ఆరావళి వీధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించింది. నాలుగు రోజులు వైద్యం అందించారు. తరవాత వైద్య ఖర్చులకు డబ్బు లేక పోవడంతో తన భర్తను ఇంటికి తీసుకెళతానని డాక్టర్లకు చెప్పింది. వారు ఓ అంబులెన్సు డ్రైవర్ నెంబరు ఇచ్చారు.
అంబులెన్సు పిలిపించి భర్తను అందులో ఎక్కించారు. భార్యను డ్రైవర్ సీటు పక్కన కూర్చోవాలని, ఇలా అయితే పోలీసులు ఆపరంటూ మాయమాటలు చెప్పారు. మార్గ మధ్యంలో డ్రైవర్, అతని సహాయకుడు లైంగిక వేధింపులకు దిగారు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో, ఆమె భర్తకు ఆక్సిజన్ తొలగించి రోడ్డు పక్కన దింపేశారు. బాధితురాలు వద్ద నుంచి పది వేలు నగదు, చిన్నపాటి ఆభరణాలు తీసుకుని పరారయ్యారు. వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.కేసు నమోదు చేసి అంబులెన్సు డ్రైవర్ అతని సహాయకుడిని కోసం వేట సాగిస్తున్నారు.