ఆర్జి కర్ ఆసుపత్రి ఘటన తరవాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ కూతురి హత్య, అత్యాచారం కేసును తప్పుదారి పట్టించేందుకు తమకు డబ్బు ఆశ చూపారని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. హత్య, అత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం విఫలం కావడంతో, పోస్టుమార్టం అయ్యే వరకు తమ బిడ్డను చూడనీయలేదని చెప్పారు. ఆ తరవాత త్వరత్వరగా అంత్యక్రియలకు ఒత్తిడి తెచ్చారని, ఓ పోలీసు అధికారి పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపాడని బాధితురాలి తండ్రి ఆరోపించారు.
డాక్టర్ హత్య, హత్యాచారం తరవాత కేసును విచారించడంతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోల్‌కతా హైకోర్టు సీరియస్ అయింది. కేసును సీబీఐకి అప్పగించింది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆర్జి కర్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను కూడా సీబీఐ అరెస్ట్ చేసి, వారికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది.
డాక్టర్ హత్యను నిరసిస్తూ బుధవారం రాత్రి కోల్‌కతా వాసులు లైట్స్ ఆఫ్ మార్చ్ నిర్వహించారు. నగరవాసులు బుధవారం రాత్రి లైట్లు ఆపేసి నిరసన తెలిపారు. నగరం చీకటి మయంగా మారింది. రాజ్‌భవన్‌లో కూడా లైట్లు ఆపేశారు. వెలుతురు భయాన్ని కలిగించినప్పుడు, చీకటి అండగా నిలుస్తుందని గవర్నర్ ఆనంద్ బోస్ వ్యాఖ్యానించారు.