వరద తగ్గినా వర్షాలు మాత్రం వెంటాడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీకి వరద ఒక్కసారిగా తగ్గింది. గరిష్ఠంగా 12.43 లక్షల నుంచి లక్షా 90 వేలకు తగ్గింది. విజయవాడను బుడమేరు ముంచేసింది. ప్రస్తుతానికి వరద తగ్గినా మరలా వర్షాలు మొదలు కావడంతో ఆందోళన నెలకొంది. అల్పపీడనం ప్రభావంతో గడచిన 24 గంటల్లో 6 సెం.మీ వర్షం నమోదైంది. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు మూసివేశారు.మున్నేరు వరద తగ్గుముఖం పట్టింది. ఏపీలో 6 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇప్పటి వరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 లంక గ్రామాలు వరద నుంచి బయటపడుతున్నాయి. ప్రభుత్వం సహాయ చర్యలు కొనసాగిస్తోంది.
విజయవాడలో పలు కాలనీల నుంచి వరద క్రమంగా తగ్గుతోంది. సింగ్‌నగర్, ప్రకాశ్‌నగర్, కండ్రిగ, వాంబేకాలనీ, జక్కంపూడి కాలనీలు వరద నుంచి బయటపడుతున్నాయి. దాదాపు 4 లక్షల మంది వరద భారిన పడ్డారు. చాలా ప్రాంతాల్లో 8 అడుగుల వరద చేరడంతో భారీ నష్టం వాటిల్లింది. లక్ష ఇళ్లు నీట మునిగాయి. వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసరాలు ఉచితంగా సరఫరా చేస్తోంది.