వైఎస్ఆర్‌సిపి నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ఆయనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి వెళ్ళి నిర్బంధించారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసులో నందిగం సురేష్‌తో పాటు మరికొందరి మీద కేసు నమోదయింది. ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం నిందితులు పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దాంతో సురేష్‌ను అరెస్ట్ చేసేందుకు తుళ్ళూరు పోలీసులు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి వెళ్ళారు. సురేష్ లేరని తెలియడంతో పోలీసులు వెనుదిరిగారు. అయితే అప్పటికే సురేష్ సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ట్రాక్ చేస్తున్న పోలీసులు, ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు గ్రహించారు. అక్కడికి వెళ్ళిన బృందం సురేష్‌ను అరెస్ట్ చేసి, మంగళగిరికి తీసుకువచ్చింది.
ఈ కేసులో నిందితులుగా ఉన్నవారి కోసం ఏపీ పోలీసులు 12 బృందాలు ఏర్పాటు చేసారు. సురేష్‌తో పాటు లేళ్ళ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ తదితరుల కోసం అన్వేషిస్తున్నారు.