వరద బాధితుల్ని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ లోని రాజరాజేశ్వరి పేట వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ , వర్షాలు, వరదల గురించి ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోలేదన్నారు. వరదతో చంద్రబాబు ఇల్లు మునిగిపోవడంతోనే కలెక్టరేట్ కార్యాలయంలో ఉండి బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి ఏనాడూ కనిపించలేదన్నారు.
ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ సమీక్ష ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఉంటే ఇంతటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. చంద్రబాబు చేసిన తప్పులకు అధికారులను బలి చేయడం సరికాదన్నారు. రిటైనింగ్ వాల్ లేకుంటే కృష్ణలంక మునిగిపోయేదన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసింది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. చంద్రబాబు నివాసం మునగకుండా ఉండేందుకు బడమేరు గేట్లు ఎత్తారని ఆరోపించారు.