వైసీపీ పై జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలు, సీఎం చంద్రబాబు సమర్థతను ప్రశంసించాల్సిన వైసీపీ విమర్శలు చేయడం సరికాదన్నారు. బుడమేరు 90 శాతం ఆక్రమణకు గురైందని, అదే ఇప్పుడు విజయవాడకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
క్లిష్ట పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు సమర్థంగా పని చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలు కూడ సహాయక చర్యల్లో పాల్గొని, ఆ తర్వాత విమర్శలు చేయాలని చురకలు అంటించారు.
తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడంపై పవన్ స్పందించారు. తాను వెళ్ళడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు వస్తాయనే వెళ్ళలేదన్నారు. ఈ సమయంలో అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెంచడం సరికాదన్నారు.
వైసీపీ నేతలు వస్తానంటే తన కాన్వాయ్‌లోనే తీసుకు వెళ్తానన్నారు.
సహాయక చర్యల్లో పంచాయతీరాజ్ శాఖ సిబ్బందితో పాటు ఇతర అధికారులు 175 బృందాలుగా విజయవాడ పట్టణ ప్రాంతంలో పని చేస్తున్నారని తెలిపారు. వరద ప్రభావం లేని జిల్లాల నుంచి 900 మంది పారిశుద్ధ్య కార్మికులు వచ్చి సేవలు అందిస్తున్నారని వివరించారు. 26 ఎన్డీఆర్ఎఫ్, 24 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నాయన్నారు. నేవీ నుంచి 2, ఎయిర్ ఫోర్స్ నుంచి 4 హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.