ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రూనై లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ బ్రూనై వెళ్ళారు. నేడు బ్రూనై రాజు హాజీ హసనల్ బోల్కియాతో సమావేశం అయ్యారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రాజభవనంగా పేరొందిన రాజు నివాసంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. రాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు.
భారత్- బ్రూనై మధ్య వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. చారిత్రక బంధాలను సరికొత్త ఎత్తులకు తీసుకువెళ్లడమే తన పర్యటన ఉద్దేశమని చెప్పారు. బహుళపాక్షిక అంశాలపై పరస్పరం గౌరవం, అవగాహనతో రెండు దేశాలూ ముందుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు.
ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల్లో బోల్కియా ఒకరు. ఆయన వద్ద సుమారు 5 బిలియన్ల డాలర్ల ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయని ప్రచారం జరిగింది. 30 బిలియన్ కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఖరీదైన ఏడు వేల వాహనాలతో పాటు మూడు సొంత విమానాలు హెలికాప్టర్లు ఉన్నాయి.