తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని మేడారం అడువుల్లో ఘోర విపత్తు సంభవించింది. సుమారు 50వేల చెట్లు కూలాయి. పెద్ద ఎత్తున గాలి దుమారం, సుడి గాలులతో మహావృక్షాలు నేలమట్టం అయ్యాయి. ఆగస్టు 31న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మేడారంలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకూ భారీ నష్టం జరిగింది.
సుమారు 15 కిలో మీటర్ల పరిధిలో 150 హెక్టార్ల విస్తీర్ణంలో 50 వేల చెట్లు నేలకూలాయి. గంటకు 120 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలులే కూలడానికి కారణమని అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
ములుగు జిల్లా ఫారెస్ట్ అధికారి రాహుల్ జావేద్ ఆధ్వర్యంలోని బృందం ఉపగ్రహ డేటా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) తో కలిసి కారణాలను అన్వేషిస్తోంది.