వరదతో అల్లాడుతోన్న ఏపీ ప్రజలకు శుభవార్త. శ్రీశైలం డ్యాం గేట్లు మూసివేశారు. ఎగువ నుంచి వస్తోన్న వరద తగ్గడంతో గేట్లు అన్నీ మూసివేశారు. జూరాల నుంచి కేవలం లక్షా 37 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సుంకేశుల నుంచి 16 వేల క్యూసెక్కుల వరద శ్రీశైలం చేరుతుంది. డ్యాం నీటి మట్టం 883 అడుగులుగా ఉంది.
నాగార్జునసాగర్ డ్యాంకు వచ్చే వరద తగ్గడంతో గేట్లు క్రమంగా మూసివేస్తున్నారు. సాయంత్రానికి అన్ని గేట్లు మూసివేయనున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజీకి వచ్చే వరద 7 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. దీంతో లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ముంపు ఇంకా తొలగలేదు.
బుడమేరు వరద క్రమంగా తగ్గుతోంది. గత రాత్రి కురిసిన వర్షాలకు మరోసారి బుడమేరు పొంగే ప్రమాదం పొంచిఉంది. విజయవాడలో 16 డివిజన్లు నీట మునిగాయి. 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద వదిలేందుకు మరో మూడు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ లోగా భారీ వర్షాలు పడితే వరద ముంపు నుంచి బయట పడటానికి వారందాకా పట్ట వచ్చని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.