ఆంధ్రప్రదేశ్ పై వరుణుడు ఇప్పట్లో కనికరం చూపేలా కనిపించడం లేదు. బుడమేరు, ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పట్టినా దక్షిణ కోస్తా, గోదావరి జిల్లాల్లో తెల్లవారు జాము నుంచి ఉదయం 8 గంటల వరకు వాన పడుతూనే ఉంది. దీంతో పలు రహదారులపై నీళ్ళు నిలిచాయి. విజయవాడలో కురిసిన వానతో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. తీరప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
గుంటూరు, బాపట్ల, గోదావరి జిల్లాలతో పాటు డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. రాజమహేంద్రవరం , అమలాపురం, మండపేట, పి.గన్నవరం, కొత్తపేట, రాజోలు, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురంలోనూ ఇదే పరిస్థితి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 7.6 అడుగులకు చేరడంతో సముద్రంలోకి 4.64లక్షల క్యూసెక్కులు వదిలారు.