మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అస్సాంలో 20 వేల కోట్లకు, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో దోపిడీకి తెగబడ్డారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే రెండు నెలల్లోనే 30 శాతం లాభాలు ఇస్తామంటూ వేలాది మంది నుంచి డబ్బు వసూలు చేశారు. కొందరికి మొదట్లో భారీ లాభాలు ఇవ్వడంతో జనం వేలంవెర్రిగా పెట్టుబడులు పెట్టారు. ఇలా 20 వేల కోట్లు ప్రజల నుంచి కాజేసిన ముఠాలోని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిబ్రూగర్ నుంచి విశాల్ పుకాన్, స్వప్నిల్ దాస్ అనే ఇద్దరు మోసగాళ్లను అరెస్ట్ చేశారు.
నాలుగు సంస్థలు ఏర్పాటు చేసి ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో 20 వేల కోట్ల దోపిడీకి తెగబడ్డ ఘటన ఇప్పుడు అస్సాంలో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై సీఎం హిమంత స్పందించారు. దోపిడీకి పాల్పడ్డ వారి వెనుక ఎంతటి వారున్నా వదిలేదే లేదని సీఎం హెచ్చరించారు.
సెబీ నిబంధలకు ఉల్లంఘించి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు ప్రాధమిక విచారణలో గుర్తించారు. నిందితులు పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. సినీరంగంలోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారని పోలీసులు తెలిపారు. ముఠాలో పదుల సంఖ్యలో సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.