వరద ముప్పు తప్పలేదు. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద నీరు మాత్రం వదలడం లేదు. ముఖ్యంగా విజయవాడ నగరం చెరువును తలపిస్తోంది. బుడమేరుకు చరిత్రలోలేని విధంగా 82 వేల క్యూసెక్కుల వరద రావడంతో 46 కాలనీలు జలమయం అయ్యాయి. విజయవాడలోని సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ, రాజేశ్వరిపేట, న్యూ రాజరాజేశ్వరిపేట, ప్రకాశ్‌నగర్, కండ్రిగ, దేవీనగర్ ప్రాంతాల్లో లక్ష ఇళ్లు నీట మునిగాయి. దాదాపు 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. వరద బాధితులకు షెల్టర్లు ఏర్పాటు చేసింది. ఆహారం, మంచినీరు అందిస్తోంది. అయితే చివరి ప్రాంతాలకు వరద సాయం అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జక్కపూడి కాలని, వైఎస్ఆర్ కాలనీ, వాంబే కాలనీల్లో జనం ఆహారం దొరక్క అలాడుతున్నారు. కరెంటు సదుపాయం కూడా లేదు. పాలు, కూరగాయలు లభించడం లేదు. చాలా మందికి మంచినీరు కూడా దొరకడం లేదు.
ప్రభుత్వం సాయం చేస్తూనే అందరూ స్పందించాలని కోరింది. 9 హెలికాఫ్టర్లను రంగంలోకి దింపారు 60 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. రెవెన్యూ యంత్రాంగం బాధితులకు సాయం అందిస్తోంది. వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. వైద్యశాఖ అప్రమత్తమైంది. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.