కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు భూముల కేటాయింపు వ్యవహారం మీద రాష్ట్రప్రభుత్వం వివరణ ఇవ్వాలని కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ కోరారు. కలబురగిలో 19 ఎకరాల భూమిని ఖర్గే కుటుంబం నిర్వహిస్తున్న ట్రస్టుకు ఉచితంగా కేటాయించడానికి వ్యతిరేకంగా బిజెపి తీవ్ర ఆరోపణలు చేస్తోన్న నేపథ్యంలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ కోరారు.
మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే కర్ణాటక ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారనీ బిజెపి నేతలు గవర్నర్‌కు పిటిషన్ ఇచ్చారు. దానిపై స్పందించిన గవర్నర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని వివరణ కోరారు. ఆ విషయాన్ని ధ్రువీకరించిన ప్రియాంక్ ఖర్గే, కాంగ్రెస్ నేతలపై చేస్తున్న ఆరోపణల మీద గవర్నర్ వేగంగా స్పందిస్తున్నారనీ… బీజేపీ లేదా జేడీయూ నాయకుల మీద వస్తున్న ఆరోపణల విషయంలో జాప్యం చేస్తున్నారనీ… మండిపడ్డారు.
కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డ్ (కెఐఎడిబి) ఖర్గే కుటుంబం నిర్వహిస్తున్న సిద్దార్ధ విహార ట్రస్ట్‌కు ఐదు ఎకరాల భూమిని కేటాయించడంతో వివాదం మొదలైంది. బెంగళూరు సమీపంలోని హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో ఎస్‌సి పారిశ్రామికవేత్తల కోసం కేటాయించవలసిన భూమిని ఖర్గే కుటుంబ ట్రస్టుకు కేటాయించడం వివాదాస్పదమైంది.