ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారం తరవాత బెంగాల్ ప్రభుత్వం నిందితులకు కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టం తీసుకువచ్చింది. అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు కోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచారు. ఈ బిల్లు చరిత్రాత్మకమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు పడాలని, ఈ బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదించేలా ప్రతిపక్షాలు ఒత్తిడి తేవాలని ఆమె కోరారు.
ఈ బిల్లుపై చర్చ లేకుండా ఆగమేఘాలపై తేవడంపై అసెంబ్లీలో బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. కొన్ని సవరణలు తేవాలని డిమాండ్ చేశారు. దీంతో బెంగాల్ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సభలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పేర్లు ప్రస్తావించడంపై కూడా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్జి కర్ ఆసుపత్రి ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సంజయ్ ఘోష్‌ను అరెస్ట్ చేసింది. అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు సీబీఐ విచారణలో తేలింది. ఇప్పటికే సంజయ్ ఘోష్‌కు పాలిగ్రాఫ్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. మరికొంత మందికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ ఏర్పాట్లు చేస్తోంది.