కాంగ్రెస్ కేరళ విభాగం ఆ పార్టీ నాయకురాలు సిమీ రోజ్‌బెల్ జాన్ మీద వేటు వేసింది. పార్టీ నాయకత్వం అరాచకాల గురించి బహిరంగంగా మాట్లాడినందుకు ఆమెను బహిష్కరించింది. కాంగ్రెస్‌లో మహిళా నాయకులు ఎదగాలంటే ఉన్నతస్థాయిలోని వారి ‘స్పాన్సర్షిప్’ ఉండాలంటూ సిమీ చేసిన ఆరోపణలు ఆ పార్టీలో సంచలనం సృష్టించాయి.
సిమీ రోజ్‌బెల్ జాన్ గతంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యురాలు. సిమీ చేసిన ఆరోపణల మీద చర్య తీసుకోవాలంటూ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) రాజకీయ వ్యవహారాల కమిటీ, మహిళా పదాధికారుల విభాగం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పార్టీ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేసాయి. వారందరూ ఉమ్మడిగా చేసిన ఫిర్యాదుకు స్పందనగా కాంగ్రెస్ పార్టీ సిమీని పార్టీ నుంచి బహిష్కరించింది.
సిమీ ప్రకటన పార్టీ క్రమశిక్షణను తీవ్రంగా ఉల్లంఘించడమేనని కెపిసిసి వ్యాఖ్యానించింది. పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాలనే లక్ష్యంతోనే సిమీ ఆరోపణలు చేసిందనీ, ఆమె వ్యాఖ్యలు లక్షలాది పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకురాళ్ళను మానసికంగా వేధించాయనీ కెపిసిసి ప్రకటించింది.
తనను పార్టీనుంచి బహిష్కరించడంపై సిమీ స్పందించారు. ఆత్మగౌరవం, హుందాతనం కలిగిన మహిళలు కాంగ్రెస్‌లో పనిచేయలేరని సిమీ వ్యాఖ్యానించారు. తనమీద చేసిన ఆరోపణలను నిరూపించగల ఆధారాలు ఏమైనా ఉంటే పార్టీ నాయకత్వం వాటిని బైటపెట్టాలని ఆమె డిమాండ్ చేసారు. పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన తనను బహిష్కరించడాన్ని ఆమె తప్పుపట్టారు. తను సిపిఎంతో కలిసి కుట్ర పన్నుతున్నానని కొందరు నాయకులు ప్రచారం చేస్తున్నారనీ, వారు దానికి ఆధారాలు చూపించాలనీ డిమాండ్ చేసారు.
కేరళ శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు వి.డి సతీశన్ వంటివారితో ‘సత్సంబంధాలు’ లేనివారిని పక్కన పెట్టేస్తారని సిమీ కొద్దిరోజుల క్రితం ఆరోపించారు. సతీశన్, ఎంపీ హిబీ ఈడెన్ వంటివారి అభ్యంతరాల కారణంగానే తనను పక్కకు నెట్టేసారని వాపోయారు.
కేరళ చిత్రపరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం కొన్నాళ్ళుగా పెద్ద గొడవ అవుతోంది. మళయాళీ చిత్ర పరిశ్రమలో 15మంది సభ్యుల ‘పవర్ గ్రూప్’ క్రియాశీలంగా ఉందని, అలాగే క్యాస్టింగ్ కౌచ్ కూడా ప్రబలంగా ఉందనీ ఆరోపణలు వచ్చాయి. ఆ వివాదం మళయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందని సిమీ ప్రకటించడం ఆ పార్టీలో సంచలనం కలిగించింది. పెద్ద నాయకుల కనుసన్నల్లో మెలిగితే, వారు చెప్పినట్టల్లా ఆడితేనే పార్టీలో మహిళా నాయకులకు ఎదుగుదల ఉంటుందని సిమీ బైటపెట్టింది. సిమీ ఆరోపణలు, కాంగ్రెస్ ఆమెను బహిష్కరించడం కేరళ రాజకీయాలను కుదిపివేసింది.
సిమీ రోజ్‌బెల్ జాన్ కాంగ్రెస్ విద్యార్ధి విభాగం కెఎస్‌యు నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన సీనియర్ నాయకుడు కె కరుణాకరన్ అనుచరురాలు ఆమె. కొన్నేళ్ళ క్రితం కరుణాకరన్ మరణం తర్వాత పార్టీలో సిమీ రోజ్‌బెల్ ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇప్పుడు సిమీ బైటపెట్టిన విషయాలు కేవలం ప్రారంభం మాత్రమేనని, ఆమె మరిన్ని వివరాలు బైటపెట్టగలదనీ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.