సహాయ చర్యల్లో కొట్టుకుపోయిన లైన్మెన్
విజయవాడ నగర పరిధిలోని ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. సహాయక చర్యల్లో పాల్గొన్న లైన్మెన్ వజ్రాల కోటేశ్వరరావు వరదలో కొట్టుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై విద్యుత్శాఖమంత్రి గొట్టిపాటి రవి విచారం వ్యక్తం చేశారు. కోటేశ్వరరావు భార్య మాధవికి ఫోన్ చేసి మాట్లాడారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా కుటుంబాన్ని ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
వరద విషాదం
సింగ్ నగర్ లో హృదయ విదారక ఘటన జరిగింది. వరద రావడంతో పద్మావతి (48) అనే మహిళ గుండె ఆగి చనిపోయింది. సోమవారం ఉదయం ఆమె ప్రాణాలు కొల్పోయినా ఈ రోజు వరకు అంత్యక్రియలకు కుదరలేదు. 4 కిలోమీటర్లు భార్య మృతదేహాన్ని తోపుడుబండిపై తోసుకుంటూ వరదలో నీటిలోనే ఆమె భర్త ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ ఘటన చూసి పలువురు కన్నీళ్ళు పెట్టారు.