వరదలతో అల్లాడుతున్న విజయవాడ, పరిసర ప్రాంత ప్రజలకు సాయం అందించాలని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి పిలుపునిచ్చారు. మైసూరు దత్త పీఠం తరఫున 50 వేల ఆహార పొట్లాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో అందజేయనున్నారు.
బెజవాడ శ్రీ దుర్గమ్మ ఆలయం నుంచి కూడా ఆహారపొట్లాలను అందజేస్తున్నారు. రోజుకు 40 వేల పులిహోర పొట్లాలను వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి అందజేస్తున్నారు.
సీఎం చంద్రబాబు పిలుపు మేరకు విజయవాడ నగరంలోని హోటల్ యజమానుల సంఘం, వరద బాధితులకు ఆహారం అందజేస్తోంది. బందరు రోడ్డులోని శేషసాయి కళ్యాణ మండపం వేదికగా భోజనం, టిఫిన్ కూడా తయారు చేస్తున్నారు. బియ్యం, రవ్వ, నూనెలు, ఇతర సరకులను పౌరసరఫరా శాఖ అధికారుల సహకారంతో గొల్లపూడి, వన్‌టౌన్ లో కొనుగోలు చేశారు. వంట చేసేందుకు 80 మంది మేస్త్రీలు, ఇతర సిబ్బంది , భోజనం పొట్లాలు సిద్ధం చేయడానికి 250 మందికి పైగా యువకులు, విద్యార్థులు, మహిళలు ముందుకొచ్చారు.
వరద బాధితులకు ఇచ్చే ఆహారం నాణ్యంగా ఉండాలని, తాను కూడా అదే తింటానని ముఖ్యమంత్రి తమకు చెప్పినట్లు హోటల్స్ యజమానుల సంఘం అధ్యక్షుడు ఆర్ వి స్వామి తెలిపారు. బాసుమతి బియ్యంతో వెజ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసి పంపిణీ చేశామన్నారు. ఉప్మా, పొంగలి కూడా అందజేశామన్నారు. పౌరులు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని హోటల్స్ యజమానుల సంఘం విజయవాడ అధ్యక్షుడు రమణ తెలిపారు.